జాగ్రత్త…..30 లక్షల వాట్సాప్ ఖాతాల బ్యాన్.

వాట్సాప్ లో కంటెంట్ ను మానిటర్ చేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. దీంతో పాటు డేటా సైంటిస్టులు, నిపుణులు, యూజర్స్ సేఫ్టీ విభాగం వంటివి ఉంటాయని వాట్సాస్ ప్రతినిధి వెల్లడించారు. వీరంతా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.

ఈ ఏడాది జూన్ – జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. హానికరమైన, అనుచితమైన సమాచారాన్ని అరికట్టడానికి, సురక్షితమైన యూజర్ అనుభవాన్ని అందించడం కోసం ఖాతాలను నిషేదించినట్లు వాట్సాప్ పేర్కొంది.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధించిన ఐటీ రూల్స్ 2021తో పాటు, వాట్సాప్ గైడ్ లైన్స్ అనుసరించని ఖాతాలను నిషేధిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం విధించిన ఐటీ రూల్స్ 2021ని మే 26 నుంచి అమలు చేస్తున్నట్లు వాట్సాస్ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి 46 రోజులకోసారి నివేదిక సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి నివేదికను ఇప్పటికే విడుదల చేయగా.. ఇది రెండో నివేదిక అని తెలిపారు

భారత దేశంలో దాదాపు 30 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. జూన్ 16వ తేదీ నుంచి జూలై 31 మధ్యలో తమకు 594 ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఫిర్యాదులను పరిశీలించి.. 30 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు స్పష్టం చేసింది. వాట్సాప్ అందించిన తాజా నివేదిక ప్రకారం. దేశంలో 30,27,000 మంది అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. ఈ అకౌంట్లకు సంబంధించిన ఫోన్ నంబర్లన్నీ +91తో ప్రారంభం అయ్యాయని తెలిపింది.