ముంచుకొస్తున్న విద్యుత్ కష్టాలు ఎందుకో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ‘కొవిడ్‌’ వల్ల ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గడం తో బొగ్గు వినియోగం చాలా తగ్గింది.దీనితో బొగ్గు గనుల్లో ఉత్పత్తి బాగా తగ్గింది. ప్రస్తుతం పరిశ్రమల కార్యకలాపాలు ఊపందుకోవడంతో బొగ్గుకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో తగినంతగా బొగ్గు లభ్యత లేదు మరియు ధర కూడా బాగా పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బొగ్గు ధర టన్నుకు 60 డాలర్లు. ప్రస్తుతం 200 డాలర్లకు పెరిగింది. రవాణా ఖర్చులు అధికమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని అన్నీ థర్మల్‌ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్‌ ఫీల్డ్స్‌, సింగరేణి కాలరీస్‌ నుంచి బొగ్గు సరఫరా అవుతోంది.విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా విద్యుదుత్పత్తి పెంచడంతో బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కు సింగరేణి నుంచి నిరంతరాయంగా బొగ్గు సరఫరా ఉండటంతో విద్యుత్ కొరత ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

బొగ్గు కొరతతో చైనాలో విద్యుత్తు కోతలు పెరగడం ఈ మధ్య కాలంలో చర్చనీయాంశమైంది. ఈ కొరత సమస్య మనదేశంలోనూ ఉత్పన్నమవుతోంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు అడుగంటడమే దీనికి కారణమనీ చెప్తున్నారు. దేశంలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో నిబంధనల ప్రకారం 23 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కలిగి ఉండాలి.బొగ్గు కొరత కారణంగా 135 కేంద్రాల్లో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపోయేలా మాత్రమే నిల్వలున్నాయని కేంద్ర ఇంధన వనరుల శాఖ స్పష్టం చేసింది. ఈ కొరత ఈ విధంగానే కొనసాగితే విద్యుదుత్పత్తి తగ్గి, కోతలు బాగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.