మన శరీరంలోని ప్రతి అవయవం చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మనం ఎక్కువగా వినేది మాత్రం “ఫ్యాటీ లివర్” అనే పదమే. ఫ్యాటీ కిడ్నీ, ఫ్యాటీ హార్ట్ వంటి పదాలు అంతగా వినిపించవు. దీనికి కారణం ఏమిటంటే, శరీరంలో కొవ్వు ముందుగా చేరే అవయవం లివర్ కావడమే.
మనము రోజూ తీసుకునే ఆహారంలో అన్నం, పిండి పదార్థాలు, చక్కెరలు, నూనెలు ఎక్కువగా ఉంటే… శరీరానికి అవసరం లేని అదనపు శక్తిని శరీరం కొవ్వుగా మార్చి దాచుకుంటుంది. ఉపవాసాలు చేయడం, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కూడా ఈ కొవ్వు నిల్వ అవుతుంది. ఈ మొత్తం కొవ్వు ముందుగా చేరేది లివర్లోనే.
లివర్ ఒక హద్దు వరకు కొవ్వును నిల్వ చేసుకుంటుంది. ఆ హద్దు దాటినప్పుడు మిగిలిన కొవ్వు చర్మం కింద, పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. కానీ కొవ్వు ఎక్కువగా లివర్‌కే చేరడంతో, లివర్ కణాల్లోనే కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
ఊబకాయం ఉన్న 100 మందిని పరిశీలిస్తే, సుమారు 80 నుంచి 90 మందికి ఫ్యాటీ లివర్ ఉండే అవకాశముంది. కొన్ని అరుదైన కారణాల వల్ల కొంతమందికి ఈ కొవ్వు ఇతర అవయవాల్లో చేరవచ్చు గానీ, ఎక్కువగా ప్రభావితమయ్యేది లివర్‌నే.
ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు శరీరంలో ఏమి జరుగుతుంది?
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఫ్యాటీ లివర్ ఉన్నా మొదట ఎలాంటి లక్షణాలు కనిపించవు. లివర్ తన పనిని కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్ పనితీరు నెమ్మదిస్తుంది.
లివర్ మన శరీరంలోని టాక్సిన్స్, చెడు పదార్థాలు, ఫ్రీ రాడికల్స్‌ను శుద్ధి చేసే ముఖ్యమైన అవయవం. లివర్ సోమరపడితే ఈ శుద్ధి ప్రక్రియ తగ్గిపోతుంది. దాంతో శరీరంలో విషపదార్థాలు పెరిగి అనేక సమస్యలకు దారి తీస్తాయి.
కొవ్వు ఇంకా పెరిగితే లివర్ పరిమాణం పెరుగుతుంది, గట్టిపడుతుంది. ఈ పరిస్థితి చాలాకాలం అలాగే కొనసాగితే లివర్ సిరోసిస్ అనే ప్రమాదకర దశకు చేరుకుంటుంది. అప్పుడే బయటికి లక్షణాలు కనిపిస్తాయి.
లివర్‌ను ఇంట్లోని తల్లితో పోల్చవచ్చు. ఇంట్లో అందరి బాధ్యతలు మౌనంగా మోసే తల్లి ఎలా ఉంటుందో, శరీరంలో లివర్ కూడా అలాగే అన్ని పనులు చేస్తుంది. లివర్ దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతిన్నట్టే.
ఫ్యాటీ లివర్‌కు గుండె జబ్బులకు సంబంధం ఉందా?
అవును. ఇటీవలి పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మనం తినే ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఆహారం, మాడిన నూనెలు వంటివాటితో శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి.లివర్ ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ శుద్ధి చేస్తుంది. కానీ ఫ్యాటీ లివర్‌లో ఈ సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా రక్తంలో చెడు కొవ్వులు, ఇన్ఫ్లమేషన్ పెరుగుతాయి.
లివర్‌లో నిల్వ ఉన్న కొవ్వు ఆక్సిడైజ్ అయి, ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే కెమికల్స్ విడుదల చేస్తుంది. ఇవి గుండె రక్తనాళాల లోపలి పొరను గరుకుగా చేస్తాయి. ఆ గరుకైన చోట కొలెస్ట్రాల్, కాల్షియం, ప్లేట్లెట్లు పేరుకుపోయి రక్తనాళాలు మూసుకుపోతాయి. దాంతో హార్ట్ అటాక్ లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పిల్లలు, యువతలో కూడా గుండె జబ్బులు పెరగడానికి కారణం కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు వంటి ఆహారాలే. ఇవి రక్తనాళాల స్మూత్‌నెస్‌ను నాశనం చేస్తాయి.
ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గుతుందా?
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గే సమస్యే.
సిరోసిస్ దశకు వెళ్లకముందే జాగ్రత్త పడితే ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది. గ్రేడ్-1, గ్రేడ్-2 ఫ్యాటీ లివర్ ఉన్నవారు జీవనశైలి మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఏమి చేయాలి?
- రాత్రి భోజనం తొందరగా, తేలికగా తీసుకోవాలి
- పండ్లు, సలాడ్లు, మొలకలు ఎక్కువగా తినాలి
- నూనె, పిండి పదార్థాలు తగ్గించాలి
- అన్నం పరిమితంగా తీసుకోవాలి
- యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
- వారానికి ఒకటి రెండు రోజులు ఫ్రూట్ లేదా జ్యూస్ ఫాస్టింగ్ చేయవచ్చు
ఇలా ఒక నెల పాటిస్తే 50–60% వరకు లివర్ నార్మల్ అవుతుంది. రెండు నెలలు క్రమంగా పాటిస్తే 90% మందిలో ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గిపోతుంది.లివర్ తనను తాను వేగంగా రిపేర్ చేసుకునే శక్తి ఉన్న అవయవం. మనము దానికి ఒక అవకాశం ఇవ్వడమే చాలు.