ఆరోగ్యం బాగానే ఉందని భావించి చాలా మంది సంవత్సరాల తరబడి ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోరు. అయితే 40 ఏళ్లు దాటిన తర్వాత క్రమం తప్పకుండా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే, ముందుగానే గుర్తించి నివారించుకోవడం ఉత్తమ మార్గమని ఆయన తెలిపారు.
లక్షణాలు లేకున్నా పరీక్షలు అవసరం
చాలామంది అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడే వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు.
ఫ్యాటీ లివర్ నుంచి రక్షణలో కాఫీ పాత్ర.. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
సాధారణ పరీక్షలతోనే అనేక వ్యాధుల గుర్తింపు
సంపూర్ణ రక్తపరీక్ష (CBC), కాలేయ పనితీరు పరీక్షలు (LFT), మూత్రపిండాల పనితీరు పరీక్షలు (RFT), షుగర్, కొలెస్ట్రాల్, కాల్షియం, సోడియం, పొటాషియం వంటి పరీక్షలు తక్కువ ఖర్చుతోనే చేయించుకోవచ్చని డాక్టర్ రవికాంత్ తెలిపారు. వీటి ద్వారా అనీమియా, డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎందుకు ముఖ్యమంటే?
40 ఏళ్లు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా కాలేయం, మూత్రపిండాలు, గర్భాశయం, మూత్రాశయం వంటి అవయవాల్లో గడ్డలు, సిస్టులు లేదా ఇతర అసాధారణ మార్పులను గుర్తించవచ్చు.
ప్రియుడి మోజులో కన్న కొడుకును హతమార్చిన తల్లి.. సిద్దిపేటలో సంచలనం
డాక్టర్ రవికాంత్ తన అనుభవాన్ని పంచుకుంటూ, ఏళ్ల తరబడి ఎలాంటి పరీక్షలు చేయించుకోని ఓ రోగిలో 20 సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ గుర్తించిన ఘటనను వివరించారు. ముందుగానే పరీక్షలు చేయించి ఉంటే ఆ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సులభంగా చికిత్స చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు
మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 40–50 ఏళ్ల వయస్సు తర్వాత మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళలు నెలకు ఒకసారి స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవడం ద్వారా చిన్న గడ్డలను కూడా ముందుగానే గుర్తించవచ్చు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని, అలాగే పాప్ స్మియర్ పరీక్ష ద్వారా క్యాన్సర్‌కు ముందు వచ్చే కణ మార్పులను గుర్తించి చికిత్స చేయవచ్చని తెలిపారు.
మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే
వయసు పెరగడం, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం, కుటుంబ చరిత్ర, ధూమపానం వంటి అంశాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ధూమపానం హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణాల్లో ఒకటని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్ (TMT), ఎకో వంటి పరీక్షల ద్వారా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు తెలిపారు.
తక్కువ ఖర్చుతోనే సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు
సాధారణ ఆరోగ్య పరీక్షలకు భారీగా ఖర్చు అవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే అవసరమైన పరీక్షలన్నీ రూ.4,500 నుంచి రూ.10,000 లోపే పూర్తవుతాయని వైద్యులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉచిత లేదా రాయితీ ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులు.. రూ.200 కోట్ల అక్రమాస్తులు?
ముందస్తు జాగ్రత్తే ఉత్తమ రక్షణ
“ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్” అనే మాట ఆరోగ్య విషయంలో మరింత వర్తిస్తుంది. వ్యాధి తీవ్రస్థాయికి చేరిన తర్వాత బాధపడటం కంటే, సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను సైతం ప్రారంభ దశలోనే గుర్తించి విజయవంతంగా చికిత్స పొందే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయా? కారణాలు, నివారణ మార్గాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
